: 'జనతా గ్యారేజ్' సీన్ ....బలహీనుడి పక్షాన గ్రామం మొత్తం అండగా నిలిచింది!
'బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బతకడం ఆనవాయతీ...ఫర్ ఏ ఛేంజ్...ఆ బలవంతుడి వెనుక కూడా ఒక బలం ఉంది...జనతా గ్యారేజ్' అంటూ 'జనతా గ్యారేజ్' సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ గుర్తొచ్చే ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగికి దగ్గర్లోని మంచిరేవుల గ్రామానికి చెందిన అక్రమ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యుల మధ్య భూవివాదం నడుస్తోంది. దీంతో అక్రమ్ వ్యతిరేక వర్గం బడాబాబులను ఆశ్రయించింది. దీంతో వారు రంగంలోకి దిగి పోలీసులపై ఒత్తిడి పెంచారు. దీంతో 'మాట్లాడాలి రమ్మంటూ' నార్సింగి ఇనెస్పెక్టర్ రామచంద్రరావు తన కానిస్టేబుల్ తో అక్రంకి కబురంపారు.
అయితే, పోలీస్ స్టేషన్ కు ఎందుకు రమ్మంటున్నారో, వెళ్తే ఏం జరుగుతుందో ముందుగానే అంచనా వేసిన అక్రం తీవ్ర ఆందోళనలో ఉండగా, విషయం తెలిసిన గ్రామస్థులు 'మేమున్నాం పద' అంటూ అక్రమ్ తో కలిసి మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. స్టేషన్ కు వెళ్లిన వారంతా ఇనెస్పెక్టర్ ని కలిసి... 'మాట్లాడుకుందాం రమ్మన్నారు కదా! మాట్లాడండి' అని అడిగారు. అలా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వారిలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు లంకల పాపిరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ కృష్ణభగవాన్ రెడ్డి, నార్సింగ్ సింగిల్ విండో వైస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ లు జి.ఆంజనేయులు, పి. సంజీవరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఈశ్వరయ్య, మాజీ సర్పంచ్ ఉప్పరి కళమ్మ భర్త ముత్యాలు తదితరులున్నారు.
దీంతో కాసేపు మామూలు విషయాలు మాట్లాడిన ఇనెస్పెక్టర్ తనిఖీలకు వెళ్లాలంటూ వేగంగా వెళ్లిపోయారు. రెండు, మూడు గంటలైనా ఆయన రాలేదు. దీంతో పక్కనే ఉన్న ఎస్సై విజయ్ నాయక్ కు 'ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు మేమంతా వచ్చి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా'మని చెప్పండి అని చెప్పేసి వెళ్లిపోయారు. ఆ విధంగా అక్రం తరఫున ఊరు ఊరంతా కదలి రావడంతో సదరు పోలీసధికారి మొహం చాటేశారన్నమాట!