: ఘాటు లేఖ రాసి.. అశోక్ గజపతిరాజుకు షాకిచ్చిన ఎయిర్ ఇండియా పైలట్!


కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఎయిర్ ఇండియా పైలట్ షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే, సోమవారం నాడు ఎయిర్ ఇండియా పనితీరుపై ఆ సంస్థ ఉన్నతాధికారులతో అశోక్ గజపతిరాజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, ఇతర విమానయాన సంస్థలతో పోల్చితే ఎయిర్ ఇండియా పనితనంలో లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్ సుభాషిష్ మజుందార్... అశోక్ కు ఓ ఘాటు లేఖ రాశారు.

రాజకీయ నేతల్లో నిబద్ధత లోపిస్తోందని లేఖలో మజుందార్ ఆరోపించారు. లోక్ సభ, రాజ్యసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించకుండా, విలువైన సభా సమయాన్ని రాజకీయ నాయకులు వృథా చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఒక్క లోక్ సభలోనే 92 గంటల సమయాన్ని వేస్ట్ చేశారని విమర్శించారు. సభా నియమాలను పాటించకుండా.... సభలో పోస్టర్లు ప్రదర్శించడం, నినాదాలు చేయడం, విమర్శలు గుప్పించుకోవడంలాంటివి చేస్తున్నారని అన్నారు.

ప్రపంచంలో ఇతర దేశాల నేతల నిబద్ధతతో పోల్చితే, మన దేశ నాయకులు చాలా వెనకబడ్డారని ఎయిర్ ఇండియా ఉద్యోగులు భావిస్తున్నారని విమర్శించారు. ఓ బాధ్యత గల ఉద్యోగిగా, నిజాయతీగా పన్ను చెల్లించే వ్యక్తిగా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పారు. రాజకీయ నేతలంతా తాము ఏం చేస్తున్నామన్న విషయంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. అప్పుడే మిమ్మల్ని చూసి ఎయిర్ ఇండియా ఉద్యోగులు కూడా మారుతారని అన్నారు.

  • Loading...

More Telugu News