: జయలలిత మృతిపై నేడు హైకోర్టులో విచారణ.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలు
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను నేడు మద్రాసు హైకోర్టు విచారించనుంది. జయ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని, ముగ్గురు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలతో కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని కోరుతూ చెన్నైలోని అరుంబాకంకు చెందిన జోసెఫ్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జయలలిత ఆస్పత్రిలో చేరిన తర్వాత ఏం జరిగిందన్న దానిపై ప్రజల్లో పలు అనుమానాలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. సెప్టెంబరు 22న జయ ఆస్పత్రిలో చేరినప్పుడు రెండు రోజుల్లో ఆమెను డిశ్చార్జి చేయనున్నట్టు చెప్పారని గుర్తు చేశారు. ఆ తర్వాత క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు చెప్పారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే జయ మృతిపై అనుమానాలున్నాయని, ఏం జరిగిందనే వాస్తవం ప్రజలకు తెలియదని పేర్కొన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని కోరారు.