: విద్యార్థి మృతిపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చార్సీ నోటీసులు
నల్గొండ జిల్లాలో ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థి సాంబారులో పడి ఇటీవల మృతి చెందిన సంఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ నెల 23న నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న బల్కూరి జయవర్దన్ (5) అనే విద్యార్థి సాంబారులో పడి మృతి చెందాడు. మధ్యాహ్నభోజనం సమయంలో విద్యార్థులందరూ వరుసలో నిలబడగా, వెనుక నిలబడ్డ విద్యార్థులు తోసుకోవడంతో ముందు నిలబడి ఉన్న జయవర్దన్, వేడిగా ఉన్న సాంబారు గిన్నెలో పడిపోయాడు. దీంతో, వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు, తీవ్ర గాయాలపాలైన అతన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ మూడురోజుల క్రితం చనిపోయాడు.