: మిషెల్లీ ఒబామాపై కామెంట్ చేసిన మహిళ ఉద్యోగం ఊడింది!
అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రథమ పౌరురాలు (ఫ్లోటస్) మిషెల్లీ ఒబామా ను ‘చింపాంజీ’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహిళను ఉద్యోగం నుంచి తొలగించారు. క్లే కౌంటీ డెవలప్ మెంట్ కార్ప్ అనే నాన్ ప్రాఫిట్ సంస్థకు డైరెక్టర్ గా పనిచేస్తున్న పమిలా టేలర్ అనే మహిళ, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇటీవల ఎన్నికైన అనంతరం ఈ వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ ఎన్నికవడం తనకు ఆనందంగా ఉందని, ఇప్పటివరకూ ప్రథమ పౌరురాలి స్థానంలో ఒక చింపాంజీని చూడాల్సి వచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
కాగా, సదరు సంస్థ కార్యకలాపాలపై అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వ సాయం పొందుతున్న ఈ సంస్థలో అధికారులు నియమ, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చినట్లు తేలడంతో ఆ సంస్థను రద్దు చేయడమో లేక ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడమో జరుగుతుందని తెలుస్తోంది. కాగా, వెస్ట్ వర్జీనియా మేయర్ బెవర్లీ వాలింగ్స్ కూడా మిషెల్లీ ఒబామాను చింపాంజీతో పోల్చుతూ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై విమర్శల వర్షం కురవడంతో చివరకు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించడం విదితమే.