: కుంభమేళాలో 2.75లక్షల మంది గల్లంతు
పుణ్య స్నానాల కోసం అలహాబాద్ లోని త్రివేణీ తీరానికి వెళుతున్న వారిలో కొందరి జీవితాలు చెల్లా చెదురవుతున్నాయి. తెగిన గాలి పటాలుగా మారుతున్నాయి. జనవరి 14న మొదలైన ఈ మహా వేడుక సాక్షిగా ఇప్పటివరకూ 2.75 లక్షల మంది తప్పి పోయారని అంచనా. వారిలో నేటి వరకూ 1.23 లక్షల మంది ఆచూకీ లభించలేదు.
వేలు లక్షలు కాదు, కుంభమేళా మొదలైన తర్వాత నెల రోజుల వ్యవధిలో సుమారు ఇరవై కోట్ల మంది అలహాబాద్ కు వచ్చి ఉంటారని ఒక అంచనా. ఊరు కాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం. దేశంలో ఎక్కడెక్కడి నుంచో భక్తులు పుణ్య స్నానాల కోసం అలహాబాద్ కు ప్రయాణం అవుతున్నారు. భారీ భక్త జన సందోహం మధ్య తమ వారి నుంచి చిన్నారులు, పెద్దలు తప్పి పోతున్నారు.
ఇలా ఆచూకీ తప్పిపోయిన వారిని గుర్తించేందుకు త్రివేణి తీరంలో ప్రత్యేకంగా 10 కేంద్రాలు కూడా ఏర్పాటయ్యాయి. తమ వారు తప్పి పోయారంటూ ఆదుర్దాగా, ఆవేదనతో వచ్చేవారి నుంచి వివరాలను సేకరించి ఈ కేంద్రాలలోని సిబ్బంది మైకుల ద్వారా ప్రకటిస్తున్నారు. ఇలా ప్రకటలతో కొందరు ఆచూకీ మాత్రమే లభిస్తోంది. కొందరు ఎలాగోలా ఇళ్లకు చేరుకుంటున్నారు. కానీ, కొందరు మాత్రం ఆచూకీ లేకుండా పోతున్నారు. ‘‘గంగమ్మ తల్లీ ఇదేం కష్టమమ్మా అంటూ’’ తప్పిపోయిన వారి కుటుంబ సభ్యుల రోదన త్రివేణీ తీరంలో ప్రతిధ్వనిస్తోంది.