: రన్ వేపై 360 డిగ్రీల కోణంలో గింగిరాలు తిరిగిన జెట్ ఎయిర్ వేస్ విమానం
ఈ ఉదయం గోవాలోని డంబోలిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 154 మందితో ముంబైకి వెళుతూ ప్రమాదానికి గురైన జెట్ ఎయిర్ వేస్ విమానం గురించిన మరింత సమాచారం వెల్లడైంది. ఈ విమానం టేకాఫ్ సమయంలో ఫ్రంట్ వీల్ అదుపు తప్పి 360 డిగ్రీల కోణంలో గింగిరాలు తిరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో కొంతమందికి ఎముకలు విరిగాయని, విమానానికి బ్రేకులు వేసిన తరువాత, త్వరగా దిగాలన్న ఆందోళనతో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగిన కారణంగానే 15 మంది గాయపడ్డారని తెలిపారు. ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోలు విచారణ ప్రారంభించాయని పేర్కన్నారు. విమానంలోని ప్రయాణికులంతా క్షేమమేనని, మరో విమానంలో వారిని ముంబై పంపేందుకు ఏర్పాట్లు చేశామని జెట్ ఎయిర్ వేస్ ఒక ప్రకటనలో తెలిపింది.