: ఇంగ్లండ్ తో వన్డేలకు అశ్విన్, యాదవ్, జడేజా దూరం!
ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్ లో అద్భుతంగా రాణించిన రవిచంద్రన్ అశ్విన్, జడేజా, జయంత్ యాదవ్ లను జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కు దూరంగా ఉంచాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్టు సమాచారం. ఈ స్పిన్ త్రయానికి విశ్రాంతిని ఇవ్వాలని భావిస్తున్నట్టు అధికారులు చెబుతున్నప్పటికీ, ఇంగ్లండ్ సిరీస్ తరువాత ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ముఖ్యమైన ఆటగాళ్లు గాయాల బారిన పడరాదన్న ఉద్దేశంతోనే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక చెన్నైలో జరిగిన ఆఖరి టెస్టులో ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ ను వన్డే జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక కెప్టెన్ హోదాలో వన్డే పోటీలు ఆడనున్న ధోనీ, సన్నాహకంగా జరిగే రెండు వన్డే మ్యాచ్ లకూ నేతృత్వం వహించనున్నాడు. ఇంగ్లండ్ తో ఆడే బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవెన్ జట్టుకు ధోనీ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తాడని బీసీసీఐ పేర్కొంది. వీటిల్లో ఒక మ్యాచ్ ని డే / నైట్ మ్యాచ్ గా నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇంగ్లండ్ టెస్టు సిరీస్ లో గాయపడిన రోహిత్ శర్మ, వన్డే టోర్నీకీ దూరం కానున్నాడు. వేలి గాయం నుంచి కోలుకున్న అజింక్య రహానే రెండో సన్నాహక మ్యాచ్ సమయానికి జట్టుకు అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది.