: కక్కుర్తి డీఈఈ... రైల్వే దుప్పట్లను కూడా వదల్లేదు!
విశాఖపట్నం ఆర్అండ్బీ డీఈఈ సురేష్ చంద్ర పాత్రో ఇళ్లపై ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఉన్నతోద్యోగి అయిన సురేష్ చంద్రపాత్రో కక్కుర్తిని చూసి ఏసీబీ అధికారులు అశ్చర్యపోయారు. విశాఖలోని విశాలాక్షి నగర్ ఆంధ్రాబ్యాంక్ లాకర్ తెరిచి చూడగా అందులో 39 లక్షల రూపాయల నగదు లభ్యమైంది. ఆ మొత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంకా కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు, బంగారం, వెండి వస్తువులు లభ్యమయ్యాయి. అంతకంటే దారుణమైన సంగతేంటంటే... రైల్వేలోని ఏసీ గదుల్లో ప్రయాణించే వారికి కేవలం 25 రూపాయల అద్దెతో రైల్వే శాఖ బెడ్ షీట్లు అందిస్తుంది. వీటిని కూడా డీఈఈ వదల్లేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 65 దుప్పట్లను ఇంటికి తీసుకొచ్చాడు. వీటిని చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. ఈ దుప్పట్లన్నీ 2015, 2016 సంవత్సరాలవి కావడం విశేషం.