: కన్నడ నేతలు డైరెక్టర్లుగా ఉన్న బ్యాంకులో ఆరు రోజుల్లో రూ. 500 కోట్ల డిపాజిట్


కన్నడ నాట మరో నోట్ల రద్దు తరువాతి అక్రమ డిపాజిట్ల బాగోతాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ఆరంటే ఆరు రోజుల్లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో (డీసీసీబీ) ఏకంగా రూ. 500 కోట్ల మేరకు డిపాజిట్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీబీల్లో సోదాలు నిర్వహించగా, ఒక్క బాగల్ కోట్ బ్రాంచ్ లోనే రూ. 162 కోట్ల డిపాజిట్లు వచ్చినట్టు వెల్లడైంది. ఈ బ్యాంకు డైరెక్టర్లుగా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రజా ప్రతినిధులు ఉండటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అజయ్ కుమార్ సర్నాయక్ బ్యాంకు చైర్మన్ గా ఉండగా, సిద్దరామయ్య మంత్రివర్గంలోని మాజీ మంత్రులు ఎస్ఆర్ పాటిల్, హెచ్‌వై మేతి, బీజేపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీ హనుమంత్ నిరానీ తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారు.

బాగల్ కోట్ ప్రాంతంలో విపరీతమైన కరువు, కాటకాలు ప్రజలను పీడిస్తుండగా, వ్యవసాయం కుదేలైన ప్రాంతం నుంచి ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్లు ఎలా వచ్చాయని ఈడీ ఆరా తీస్తోంది. ఇక బెల్గావీ, ధార్వాడ్, హవేరి, గదక్ డీసీసీబీలు సైతం పాత డిపాజిట్ రికార్డులను బద్దలు కొట్టాయి. రాజకీయ నేతలు పాలక మండళ్లుగా ఉన్న బ్యాంకులు కావడంతో వారు తమ నల్లధనాన్ని మార్చుకునేందుకు తమ ఏలుబడిలోని బ్యాంకులనే ఆశ్రయించారని ఈడీ భావిస్తోంది. రాష్ట్రంలోని బళ్లారి, మాండ్యా, శివమొగ్గ, కోలార్, దక్షిణ కన్నడ జిల్లాల్లోని డీసీసీబీల్లో సైతం తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News