: అంతా బాబు బిల్డప్పే... తలా తోకా లేని పాలన కాదా ఇది?: వైఎస్ జగన్ సూటి ప్రశ్న
రాయలసీమ వాసులపై చంద్రబాబునాయుడు సవతి ప్రేమను చూపుతున్నారని, చిత్రావతి, శ్రీశైలం ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరున్నా, ఈ ప్రాంత వాసుల కష్టాలు తీర్చేలా నీటిని విడుదల చేయడం లేదని వైకాపా అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. పులివెందులలో మహాధర్నాలో ఆయన ప్రసంగిస్తూ, గత ప్రభుత్వాల హయాంలో 80 నుంచి 90 శాతం వరకూ పనులు పూర్తయిన ప్రాజెక్టులను చూపించి, అవన్నీ తాను చేసినవేనని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు.
పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరు ఎక్కడ తెచ్చారో చూపాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ నుంచి 48 టీఎంసీల నీరు ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి వెళ్లిపోయిందని, అంతకుమించి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ వల్ల రాష్ట్ర ప్రజలకు ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదని అన్నారు. పట్టి సీమ కట్టా, రాయలసీమకు నీటిని తెచ్చానంటూ బిల్డప్ ఇస్తున్న చంద్రబాబు నిత్యమూ అబద్ధాలు, అసత్యాలు చెబుతూ, ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
తలా తోకా లేని పాలన కాదా ఇది? అంటూ జగన్ ప్రశ్నించారు. తన ప్రశ్నలకు అధికార పక్షం వద్ద సమాధానం లేదని ఎద్దేవా చేశారు. పట్టిసీమ నుంచి తరలిస్తున్న నీటి మేరకు శ్రీశైలం నీటిని రాయలసీమకు ఇచ్చేలా జీవోను ఎందుకు జారీ చేయలేదని జగన్ అడిగారు. పట్టిసీమకు ఖర్చు చేసిన రూ. 1600 కోట్లలో రూ. 1300 కోట్లు ఖర్చు పెట్టినా నేడు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అయి, కడప, అనంతపురం జిల్లాలు సస్యశ్యామలం అయి ఉండేవని అన్నారు.