: తిరుపతిలో మొదలైన 'గౌతమీపుత్ర శాతకర్ణి' సందడి... కేరింతలు పెడుతున్న బాలయ్య అభిమానులు
తిరుపతి నగరాన్ని బాలయ్య ఫీవర్ పట్టేసింది. నేటి సాయంత్రం ఆయన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆడియో విడుదల వేడుక శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రు మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో వేడుకగా జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి కార్యక్రమం సాగనుండగా, వీవీఐపీ, వీఐపీ గ్యాలరీల నిర్మాణం పూర్తయింది. వేదిక చుట్టూ ఎన్టీఆర్, బాలకృష్ణల కటౌట్లతో పాటు చంద్రబాబునాయుడి కటౌట్లను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేశారు. అక్కడికి చేరుకుంటున్న బాలకృష్ణ అభిమానుల కేరింతలతో కార్యక్రమ వేదిక కళకళలాడుతోంది.
కాగా, కొద్ది సేపటిక్రితం తిరుపతి చేరుకున్న బాలకృష్ణ ఓ హోటల్ లో బసచేశారు. సాయంత్రం ఆయన భారీ ర్యాలీగా హైస్కూల్ గ్రౌండ్ కు చేరుకోనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారన్న సంగతి తెలిసిందే. ఇక పరిమిత సంఖ్యలోనే వేదిక వద్దకు అభిమానులను అనుమతిస్తామని, మైదానంలోకి రాలేని వారి కోసం భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశామని ఈవెంట్ నిర్వాహకులు ప్రకటించారు.