: రూ.250 కోట్ల నల్లధనంతో బంగారాన్ని కొనేశారు.. ఢిల్లీలో వెలుగుచూసిన అక్రమాలు!
నల్లధనాన్ని కూకటివేళ్లతో పెకిలించేయాలని ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. కానీ, అక్రమార్కులు, అవినీతిపరులు తమ నల్లధనాన్ని పసిడి రూపంలో భారీగానే మార్చేసుకుంటున్నట్టు ఆదాయపన్ను అధికారుల తనిఖీలను చూస్తే తెలుస్తోంది. తాజాగా ఆదాయపన్ను శాఖ అధికారులు ఢిల్లీలో బంగారం దుకాణాల్లో జరిపిన సోదాల్లో కళ్లు తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. రూ.250 కోట్ల మేర బంగారం విక్రయాలకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవు. ఇదంతా రద్దయిన పెద్ద నోట్లతో కొనుగోలు చేసిన బంగారమేనని అధికార వర్గాలు నిర్ధారించుకున్నాయి. బంగారం వర్తకులకు చెందిన 12 షాపులు, 8 నివాస భవనాల్లో శుక్రవారం రాత్రి ఈ సోదాలు జరిగాయి. ఈ వర్తకులు రద్దు చేసిన నోట్లతో రూ.250 కోట్ల బంగారం కొనుగోళ్లకు వీలు కల్పించారని ఓ ఐటీ అధికారి మీడియాకు వెల్లడించారు. నవంబర్ 8 తర్వాత గతంలోనూ ఓ సారి ఆదాయపన్ను శాఖ అధికారులు విక్రయాలను గుర్తించారు. తాజాగా వెలుగు చూసిన రూ.250 కోట్ల విక్రయాలు దీనికి అదనం.