: క్షుద్ర పూజలపై ప్రభుత్వం ఉక్కుపాదం.. పూజల పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు.. కొత్త చట్టానికి సన్నాహాలు
క్షుద్రపూజల పేరుతో ప్రజల్ని మోసం చేసేవారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు కొత్తగా ఓ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే చేతబడి, బాణామతి అంటూ ప్రజల్ని మోసం చేసే వారి పని అయిపోయినట్టే. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసిన కేంద్రం క్షుద్రపూజలను అరికట్టేందుకు ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాల గురించి తెలపాలని కోరింది. ప్రజల్లో అంతర్లీనంగా ఉన్న నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్న కొందరు క్షుద్రపూజల పేరుతో వారిని దోచుకుంటున్నారు. మరోవైపు సాంకేతికంగా దేశం పురోగతి సాగిస్తున్నా ఇంకా చాలా రాష్ట్రాల్లో చేతబడుల పేరుతో హింస కొనసాగుతూనే ఉంది.
ఇటీవల మహారాష్ట్రలో జరిగిన సంఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. చేతబడుల నెపంతో ఓ అమాయకుడిని చెట్టుకు కట్టి కొట్టి చంపేశారు. క్షుద్రపూజలను నమ్మవద్దని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా పరిస్థితుల్లో మార్పు కనిపించకపోవడంతో ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. క్షుద్ర పూజలతో మోసపోయిన తర్వాత బాధితుల పిర్యాదుతో కేసులు నమోదు చేయడం కాకుండా, క్షుద్రపూజలు చేసే వారి సమాచారం తెలియగానే కేసు పెట్టేందుకు యోచిస్తోంది. అలాగే కొత్త చట్టంలో టీవీ సీరియళ్లు, సినిమాల్లోనూ క్షుద్రపూజలను ప్రేరేపించే దృశ్యాలపై నిషేధం విధించే అవకాశం ఉన్నట్టు సమాచారం.