: ఈ విషయం గురించి ‘ట్విట్టర్’ కింగ్ మోదీ మాట్లాడరే?: లాలూ ప్రసాద్ యాదవ్
నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద గంటల తరబడి క్యూ లో నిలబడి, అక్కడ జరిగిన ఘర్షణల కారణంగా దేశ వ్యాప్తంగా మృతి చెందిన వారి గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు ప్రస్తావించట్లేదని రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. నోట్ల రద్దు అనంతరం ప్రాణాలు పోగొట్టుకున్న ప్రజల గురించి 'ట్విట్టర్ కింగ్' మోదీ ఒక్క ట్వీట్ కూడా చేయలేదని విమర్శించారు. మోదీ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లే ఈ ప్రాణ నష్టం జరిగింది కనుక, ఈ విషయమై ఆయన మాట్లాడరని విమర్శించారు. నోట్ల రద్దు అనంతరం దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని తన సంతాపం ప్రకటించాలని లాలూ తన ట్వీట్ లో డిమాండ్ చేశారు.