: మోదీని విమర్శించడానికి రాహుల్ ను వాడుకున్న కేజ్రీవాల్!
పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీలు మరోసారి విమర్శలు గుప్పించారు. అయితే, ఈ విమర్శల్లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేరును కూడా కేజ్రీవాల్ వాడుకోవడం గమనార్హం. రాహుల్ ను ఉద్దేశించి మట్లాడుతూ... మోదీగారూ, ప్రతి ఒక్క ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలా ఉండరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ట్వీట్ చేశారు. తన పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను కేజ్రీ తప్పుబట్టారు.
మరోవైపు, మమతాబెనర్జీ కూడా మోదీపై మండిపడ్డారు. సీబీఐని రంగంలోకి దింపి ప్రతిపక్ష నేతలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని... నోట్ల రద్దును బలవంతంగానైనా సమర్థించేలా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతలకు కూడా సీబీఐ నుంచి కాల్స్ వచ్చాయని... అయినా తాము భయపడమని, పెద్ద నోట్ల రద్దుపై పోరాటం చేస్తామని దీదీ చెప్పారు.