sidharthanath: అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారు: పవన్ కల్యాణ్ పై సిద్ధార్థనాథ్ సింగ్ ఘాటు విమర్శలు
ట్విట్టర్ వేదికగా భారతీయ జనతా పార్టీపై మండిపడుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ చేస్తోన్న వరుస ట్వీట్లను చదవాలన్న ఆసక్తి తనకు లేదని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ అవగాహనా రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. గోవధకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో చట్టాలున్నాయని ఆయన చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీపై గతంలో 5 అంశాలపై సమాధానం చెప్పాలని తాము పవన్ కల్యాణ్‌ను అడిగామని, ముందుగా పవన్ ఆ 5 అంశాలపై సమాధానం ఇవ్వాలని సిద్ధార్థనాథ్ అన్నారు. పలు విషయాలపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తోన్న పవన్ కల్యాణ్ రాజకీయాలపై అధ్యయనం చేయాలని ఆయన సూచించారు.
కాగా, పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో గోవధ, రోహిత్ వేముల ఆత్మహత్య, దేశభక్తి, ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంశాలపై ప్రశ్నించి బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ రోజు పెద్దనోట్ల రద్దు, బంగారంపై ఆంక్షలు అంశాలపై ప్రశ్నిస్తానని చెప్పారు.