: దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో తీర్పు వెల్లడి... ఐదుగురికీ మరణశిక్ష!
మూడేన్నరేళ్ల క్రితం హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ఐదుగురికి ఈ రోజు ఎన్ఐఏ కోర్టు శిక్ష ఖరారు చేసింది. దోషులుగా రుజువైన అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, ఐజాజ్ లకు మరణశిక్ష విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే, హైకోర్టు ఈ మరణశిక్షను ధ్రువీకరించాల్సి ఉంది.
2013 ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం జరిగిన ఈ బాంబు పేలుళ్లలో 18 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 138 మంది గాయపడ్డారు. ఆ తర్వాత కేసును ఎన్ఐఏకు అప్పగించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు ఈ ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసులో ప్రధాన నిందితుడయిన రియాజ్ భత్కల్ మాత్రం పాకిస్థాన్లో తలదాచుకున్నాడు.