: రద్దయిన నోట్లతో హైదరాబాద్ లో రూ.2,700 కోట్ల విలువైన బంగారం బిస్కెట్ల కొనుగోలు
నల్లధనం విషయంలో హైదరాబాద్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఒక్క హైదరాబాద్ మహా నగరంలోనే నవంబర్ మాసంలో రద్దయిన పెద్ద నోట్లతో ఏకంగా 2,700 కోట్ల రూపాయల విలువ మేర బంగారం బిస్కెట్లను కొందరు కొనుగోలు చేసినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణలో వెలుగు చూసింది. ఈడీ రంగ ప్రవేశంతో బంగారం కొన్న నల్లబాబులు కనిపించకుండా పోయారు. నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి నవంబర్ 30 వరకు హైదరాబాద్ నగరానికి 8,000 కిలోల బంగారం దిగుమతి అయిందని ఈడీ వర్గాల సమాచారం. అంతేకాదు డిసెంబర్ 1 నుంచి 10 వరకు మరో 1,500 కిలోల బంగారాన్ని కూడా వర్తకులు దిగుమతి చేసుకున్నారు.
ఇంత భారీ స్థాయిలో బంగారం దిగుమతి వెనుక అక్రమాలు దాగి ఉన్నట్టు ఈడీ వర్గాలు అనుమానిస్తున్నాయి. బంగారం వర్తకులు రద్దయిన నోట్లను స్వీకరించి బంగారాన్ని విక్రయించి ఉంటారన్నది దర్యాప్తు అధికారుల సందేహం. ముసద్దిలాల్ జ్యుయెలర్స్ ఒక్కటే నవంబర్ 8, 9వ తేదీల్లో రద్దయిన నోట్లపై రూ.100 కోట్ల బంగారాన్ని విక్రయించిన విషయం తెలిసిందే. కస్టమర్ల వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు జ్యుయెలర్స్ షాపుల్లో సీసీటీవీ ఫుటేజీ రికార్డులను సైతం చెరిపేసినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి.