: ఈ నియంత అధికారి వల్ల విద్యారంగమే నాశనం అవుతుంది!: తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్
తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టర్ కిషన్ వ్యవహారశైలి ప్రైవేటు పాఠశాలల ఉనికికే భంగం కలిగించేలా ఉందని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా జరిగిన సమావేశంలో కూడా ఆయన ఆందోళన కలిగించే వ్యాఖ్యలు చేశారని... గత నాలుగు దశాబ్దాలుగా తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు పిల్లలకు విద్యను అందిస్తున్న విద్యావేత్తలను అవమానించేలా మాట్లాడారని తెలిపింది.
నాణ్యమైన విద్యను అందించడం ద్వారా కుటుంబాలు, సమాజం, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రైవేట్ విద్యాలయాలను ఏమాత్రం గౌరవించకుండా కిషన్ మాట్లాడారని...అయినా, రాష్ట్ర అధికారిగా ఆయనను విద్యావేత్తలు గౌరవిస్తూనే ఉన్నారని చెప్పింది. ప్రీ ప్రైమరీ, మీడియం మార్పు, అప్ గ్రెడేషన్ తదితర అంశాల్లో విద్యాశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీలు చెప్పినా వినకుండా అహంకార ధోరణితో కిషన్ ముందుకు సాగుతున్నారని విమర్శించింది. పాఠశాల సంచాలకులుగా మార్గనిర్దేశం చేయాల్సిన ఆయన... బెదిరింపు ధోరణితో ప్రైవేట్ పాఠశాలల్లో అభద్రతా భావాన్ని నింపుతున్నారని ఆరోపించింది.
15వ తేదీన ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలను సమావేశానికి పిలిచి, రెండు గంటల సేపు నిరీక్షింపజేసి, ఆతర్వాత తాపీగా సమావేశానికి కిషన్ వచ్చారని ట్రస్మా తెలిపింది. అనంతరం తమ సమస్యలను, అభ్యర్థనలను కిషన్ తో విన్నవించుకుంటుండగా... ఆయన అవహేళన చేస్తూ, నిర్లక్ష్యంగా మాట్లాడారని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. పాఠశాలలను మీరు నడపలేకపోతే... మీ స్కూళ్లను స్వాధీనం చేసుకుని, లక్ష మందిని నియమించుకుని నేనే నడుపుతానంటూ ఆయన హెచ్చరించారని విమర్శించాయి. వారు చెప్పినట్టు లక్షమంది కాదు... తమ వద్ద నాలుగు లక్షల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పాయి.
ప్రైవేట్ పాఠశాలలను ఒక వేళ స్వాధీనం చేసుకుంటే... క్వాలిఫైడ్ కరస్పాండెంట్స్ అందరికీ నియామక ఉత్తర్వులు అందించి, వారి సర్వీసెస్ ను అనుసరించి జీతభత్యాలు ఇవ్వాలని యాజమాన్యాలు కోరాయి. అన్ క్వాలిఫైడ్ కరస్పాండెంట్స్ ను స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్ గా నియమించాలని డిమాండ్ చేశాయి. ప్రైవేట్ పాఠశాలల భవనాలకు అద్దె చెల్లించి, స్వాధీనం చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాయి. విద్యా రంగంలో ఏమాత్రం అనుభవం లేని కిషన్ వల్ల విద్యారంగానికే ముప్పు పొంచి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నియంత అధికారి నుంచి ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.