: శాసనసభలో నిప్పులు చెరిగిన జానారెడ్డి
తెలంగాణ శాసనసభ రెండో రోజు సమావేశాలు ప్రారంభమైన ఐదు నిమిషాలకే తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. అనంతరం, సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ అధికారపక్షంపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం అనేది వ్యవస్థను అవమానపరచడమే అవుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నడుస్తున్న తీరే సక్రమంగా లేదని ఆయన విమర్శించారు. సభ ప్రారంభమైన 5 నిమిషాలకే సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు.
విపక్ష సభ్యులు చెప్పేదాన్ని స్పీకర్ కూడా వినడం లేదని మండిపడ్డారు. సభ్యులందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత స్పీకర్ పై ఉందని అన్నారు. స్పీకర్ ఇలాగే వ్యవహరిస్తే, సభ నుంచి తాను కూడా వాకౌట్ చేస్తానని హెచ్చరించారు. అసలు ఈ సమావేశాలకు ఎందుకు వచ్చామా? అనే భావన కలుగుతోందని... ఇక్కడకు వచ్చి సమయాన్ని వేస్ట్ చేసుకోవడం కంటే... ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ తీరును, దారుణాలను వారికి వివరించడమే మేలని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ నడుస్తున్న తీరును యావత్ దేశం చూస్తోందన్న విషయాన్ని గమనించాలని సూచించారు.