: ట్రంప్ కుమార్తెతో కలిసి కాఫీ తాగుతారా?.. జస్ట్ రూ.50 లక్షలు చెల్లిస్తే చాలు!
అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌తో కలిసి కాఫీ తాగే అవకాశాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా... అయితే మీరు లక్షల్లో ఖర్చుపెట్టాలి మరి! ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ ఆధ్వర్యంలోని సెయింట్ జుడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్ ఆఫ్ టెన్నెసీకి విరాళాలు సేకరించేందుకు చారిటీబజ్ అనే సంస్థ ద్వారా ఇవాంకా ఓ ఆఫర్ ప్రకటించారు. ‘కాఫీ విత్ ఇవాంకా’ పేరుతో చారిటీబజ్ ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఒకే ఒక్క కాఫీతో అధ్యక్షుడికి దగ్గర కావచ్చని భావిస్తున్న బడా వ్యాపారవేత్తలు ఇందుకోసం పోటాపోటీగా బిడ్లు వేస్తున్నారు. ఎలాగైనా ఇవాంకాతో కాఫీ తాగే చాన్స్ కొట్టేయాలని భావిస్తున్నారు. లండన్ కేంద్రంగా పనిచేసే బిజినెస్ ఇన్వెస్టిమెంట్ మేనేజర్ ఓజాన్ ఒజ్కురుల్ రూ.40 లక్షలతో బిడ్ వేశారు. భవిష్యత్తులో అధ్యక్షుడితో ఎన్నో పనులుంటాయని, ఆ కుటుంబంతో స్నేహం పెంచుకునేందుకు ఇవాంకాతో కాఫీ తాగడం ఓ మార్గంలా పనికొస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అమెరికాకే చెందిన రెస్టారెంట్ చైన్ ‘టెక్స్-మెక్స్’ అధినేత రస్సెల్ వైబర్రా అయితే ఏకంగా రూ.46 లక్షలతో బిడ్ వేశారు. ఇవాంకాతో కాఫీ తాగే చాన్స్ కోసం ఎంత వెచ్చించడానికైనా తాను సిద్ధమని రస్సెల్ పేర్కొన్నారు. ఈ అవకాశం కానీ తనకు దక్కితే ఇమ్మిగ్రేషన్ పాలసీ విషయంలో తండ్రి ట్రంప్‌తో మాట్లాడాల్సిందిగా ఇవాంకాను కోరుతానని రస్సెల్ వివరించారు.