: నల్లకుబేరులకు చివరి అవకాశం.. నేటి నుంచే ‘ఫిఫ్టీ.. ఫిప్టీ’ అమలు!


నల్లకుబేరులకు ప్రభుత్వం మరో(చివరి) అవకాశం ఇచ్చింది. తమ వద్ద ఉన్న అప్రకటిత ఆదాయాన్ని స్వచ్ఛందంగా ప్రకటించే వీలు కల్పించింది. నేటి(శనివారం) నుంచి అమల్లోకి వచ్చే ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’లో భాగంగా చివరి అవకాశం ఇచ్చింది. ఇందులో భాగంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ చేసిన భారీ డిపాజిట్లపై 50 శాతం పన్ను చెల్లించడం ద్వారా దానిని తెల్లధనంగా మార్చుకోవచ్చు. ఇలా స్వచ్ఛందంగా ప్రకటించే వారి పేర్లను ప్రభుత్వం బయటకు వెల్లడించడం కానీ, విచారణ చేయడం కానీ చేయదని రెవెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్ అదియా పేర్కొన్నారు.

 అంతేకాదు, ఇలా వెల్లడించిన మొత్తాన్ని ఆ తర్వాత ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్స్‌లలో చూపించాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు. ఈ పథకాన్ని వినియోగించుకోకుండా పట్టుబడితే మాత్రం తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో భారీగా జమ చేసిన పాతనోట్లను ఐటీ రిటర్నుల్లో చూపిస్తే పన్ను, జరిమానాతో కలిపి మొత్తం 77.25 శాతం వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే స్వచ్ఛందంగా వెల్లడించకుండా, రిటర్నుల్లో చూపించకుండా దొరికితే మాత్రం పన్నుపై అదనంగా మరో పదిశాతం జరిమానా కూడా విధిస్తామని, విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని అదియా హెచ్చరించారు.

టాక్సేషన్ లాస్ యాక్ట్, 2016 బిల్లు గురువారం రాత్రే రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఇందులో భాగంగా ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’(పీఎంజీకేవై) నేటి నుంచి ప్రారంభమవుతుందని అదియా పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుందని తెలిపారు. అప్రకటిత ఆదాయానికి 50 శాతం పన్ను చెల్లించి 25 శాతం సొమ్మును నాలుగేళ్లపాటు పీఎంజీకేవై డిపాజిట్ పథకంలో పెట్టడం ద్వారా ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చని ఆయన వివరించారు. ఈ 25 శాతం సొమ్ముకు నాలుగేళ్లపాటు ఎలాంటి వడ్డీ రాదన్నారు. నల్లడబ్బుకు పన్నులు చెల్లించి, ఆ డిపాజిట్లపై దర్యాప్తు ముగిసిన తర్వాత మాత్రమే అది తెల్లధనంగా మారుతుందని పేర్కొన్నారు. మనీలాండరింగ్‌కు పాల్పడే అక్రమార్కుల గురించి తెలిస్తే blackmoneyinfo@incometax.gov.in కు సమాచారం అందించాలని అదియా కోరారు.

  • Loading...

More Telugu News