: అనురాగ్ ఠాకూర్ కు షాక్... ఆయన స్థానంలో పూనమ్ మహాజన్
బీసీసీఐ అధ్యక్షుడు, భారతీయ యువమోర్చా అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కు బీజేపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. గత ఆరేళ్లుగా భారతీయ యువమోర్చా అధ్యక్షుడిగా ఉన్న ఆయనను ఆ పదవి నుంచి తొలగిస్తూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో యువ మహిళా ఎంపీ పూనమ్ మహాజన్ ను నియమించారు. బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్ కుమార్తె అయిన పూనమ్ మహాజన్ (36) ముంబై నార్త్ సెంట్రల్ ఎంపీగా ఉన్నారు. సాధారణంగా మహిళలను పార్టీలోని మహిళా విభాగాలకు మాత్రమే అధ్యక్షులుగా చేస్తుంటారు. కానీ, భారతీయ జనతా యువమోర్చా అధ్యక్ష పదవిని ఓ మహిళకు ఇవ్వడం గొప్ప విషయమే.
ఇదే విధంగా... బీజేపీ ఎస్సీ, ఎస్టీ, కిసాన్ మోర్చా, ఓబీసీ విభాగాల అధ్యక్షులను కూడా మార్చారు. ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా కౌశాంబి ఎంపీ వినోద్ సర్కార్, ఎస్టీ విభాగం అధ్యక్షుడిగా ఛత్తీస్ గఢ్ రాజ్యసభ సభ్యుడు రాంవిచార్ నేతమ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా వీరేంద్ర సింగ్ మస్త్, ఓబీసీ విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎంపీ దారాసింగ్ చౌహాన్ లను నియమించారు. వివిధ విభాగాలను బలోపేతం చేసే క్రమంలోనే అమిత్ షా ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు.