: రాహుల్ మాటలు ఎవరు నమ్ముతారండీ?: మధ్యప్రదేశ్ సీఎం
ప్రధాని నరేంద్ర మోదీ అవినీతికి పాల్పడ్డట్టు తన దగ్గర సమాచారం ఉందని... లోక్ సభలో ఈ విషయాన్ని తాను లేవనెత్తుతాననే తనను మాట్లాడనీయడం లేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ మాటలను ఎవరూ నమ్మరని... దేశంలో ఉన్న ఏ ఒక్కరూ ఆయనను సీరియస్ గా తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. మోదీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని... సహనం కోల్పోయే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయాన్ని దేశమంతా స్వాగతిస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ, మోదీ అవినీతికి పాల్పడ్డట్టు రాహుల్ వద్ద ఆధారాలుంటే... ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.