: ‘చూస్తూ ఉండండి.. భారీ జరినామా విధిస్తాం’... అమెరికా ఆటో దిగ్గజానికి షాక్ ఇవ్వనున్న చైనా
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాము అనుసరిస్తోన్న తీరుకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చైనాకు మరోసారి కోపమొచ్చింది. తైవాన్ను తమ భూభాగంగా భావిస్తూ ఆధిపత్య ధోరణితో చైనా అనుసరిస్తున్న 'వన్ చైనా' పాలసీపై డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మరోసారి చైనాపై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్‌కు దీటుగా బదులివ్వాలని చైనా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తమ దేశం తీసుకున్న నిర్ణయం గురించి చైనా పత్రిక తెలిపింది. ఓ అమెరికా ఆటో దిగ్గజానికి త్వరలోనే తమ దేశం భారీ మొత్తంలో జరిమానా విధించబోతుందని పేర్కొంది.
అయితే ఆ ఆటో దిగ్గజ కంపెనీ పేరు మాత్రం వెల్లడించలేదు. ఓ అమెరికా ఆటో దిగ్గజం అనుసరిస్తున్న గుత్తాధిపత్య ధోరణిని ఖండిస్తున్నామని, సదరు కంపెనీ రెండేళ్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు ధరలను నిర్ణయిస్తూ వస్తోందని, ఇన్వెస్టిగేటర్ల విచారణలో ఇది స్పష్టమయిందని తమ దేశ సంబంధిత ఉన్నతాధికారులు చెప్పినట్లు పేర్కొంది. ఆ జరిమానా ఎంతమేరకు ఉంటుందన్న అంశాన్ని కూడా చైనా పత్రిక పేర్కొనలేదు. తాము ప్రచురిస్తున్నది తప్పుడు కథనం కాదని కూడా పేర్కొనడం గమనార్హం.
అమెరికా ఆటో టాప్ కంపెనీలు జనరల్ మోటార్స్ కంపెనీ, ఫోర్డ్ మోటార్ వంటి కంపెనీలు చైనాలో పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. పత్రికలో వచ్చిన కథనాలపై మాత్రం ఈ కంపెనీల అధికారులు మౌనం వహిస్తున్నారు. తమ దేశంలో యాంటీ-మోనోపలి ఇన్వెస్టిగ్వేషన్లు ప్రారంభమైనప్పటి నుంచి ఆటో దిగ్గజాలకు ఆ దేశం ఇప్పటికే పలుసార్లు జరినామా విధించింది.