: ఏపీ ఖజానా ఖాళీ.. బుసలు కొడుతున్న ఆర్థిక లోటు
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు సర్కారును భయపెడుతోంది. రోజురోజుకు పడిపోతున్న లోటును చూస్తున్న ప్రభుత్వానికి ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. ఈ 8 నెలల్లోనే ఆర్థిక లోటు రెట్టింపు అయింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.4-5 వేల కోట్ల వరకు లోటు ఉండొచ్చన్న అంచనాలు తప్పుతున్నాయి. గతనెలాఖరుకే ఇది రూ.9,407 కోట్లకు చేరింది. నోట్ల రద్దు కారణంగా భవిష్యత్తులో ఖజానా ఆదాయం మరింత దిగజారే అవకాశం ఉందని ఆర్థిక శాఖ భావిస్తోంది. అయితే ఖర్చులు ఏమాత్రం తగ్గడం లేదు. మరో నాలుగు నెలలపాటు ఖర్చులకు నిధులు ఎక్కడి నుంచి తేవాలో అర్థంకాని పరిస్థితి నెలకొందని అధికారులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.
గత నెలాఖరు నాటికి ఖర్చులు రూ.91,935 కోట్లు అయితే ఖజానా ఆదాయం రూ.రూ.82,428 కోట్లు. ఇందులో ప్రణాళికేతర వ్యయమే రూ.61,252 కోట్లు కావడం గమనార్హం. ఇక కేంద్రం నుంచి వచ్చిన పన్నుల్లో వాటా రూ. 12,296 కోట్లు కాగా గ్రాంట్లు రూ. 14,996కోట్లు. ఏపీ సొంత ఆదాయం రూ. 81,516 కోట్లు. ఖర్చుల విషయానికి వస్తే వేతనాలకు రూ.19,970 కోట్లు వెచ్చిస్తుండగా, సబ్సిడీలు, గ్రాంట్లు, పింఛన్లు, అప్పులపై వడ్డీలు, రుణాలకు వాయిదా చెల్లింపులు, ఇతర ఖర్చులు కింద ప్రణాళికేతర వ్యయం రూ.61,252 కోట్లుగా నమోదైంది. దీంతో లోటును పూడ్చే మార్గం లేక సర్కారు విలవిల్లాడిపోతుంది. పెరుగుతున్న ఖర్చులను చూసి బెంబేలెత్తిపోతోంది. ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తున్నా అది వీలుకావడం లేదు.