: మమతకు క్షమాపణలు చెప్పి... మళ్లీ మాట మార్చిన బీజేపీ నేత
పెద్ద నోట్ల రద్దుపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో నిరసన, ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దుతో మమత వేల కోట్లు నష్టపోయారని... ఆమెకు మతి భ్రమించిందని... ఢిల్లీలో ఆమె డ్రామా చేస్తున్నప్పుడు, ఆమె జుట్టు పట్టి లాగేసేవాళ్లమనీ, ఎందుకంటే ఢిల్లీలోని పోలీసులంతా తమవారే అని... కానీ తాము అలా చేయలేదని పశ్చిమబెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఘోష్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ విరుచుకుపడింది.
ఈ నేపథ్యంలో మమతకు దిలీప్ ఘోష్ క్షమాపణలు చెప్పారు. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను అవమానకరంగా భావిస్తే... ఆమెకు క్షమాపణలు చెప్పడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఆలోచన తనకు లేదని తెలిపారు. ఆ తర్వాత వెంటనే ఆయన మాట మార్చారు. మీడియాతో మాట్లాడుతూ, తాను మమతకు క్షమాపణలు చెప్పలేదని స్పష్టం చేశారు. కేవలం విచారం మాత్రమే వ్యక్తం చేశానని తెలిపారు.