: నగదురహిత లావాదేవీలు ఒక్కసారిగా 100 శాతంకు ఎలా పెరుగుతాయి?: చిదంబరం
దేశంలో 3 శాతంగా జరుగుతున్న నగదురహిత లావాదేవీలు ఒక్కసారిగా కొన్ని నెలల్లోనే 100 శాతంకు ఎలా పెరుగుతాయి? అని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం సాధ్యంకాని రీతిలో విపరీతంగా అంచనాలను వేస్తోందని ఆయన విమర్శించారు. ఈ రోజు నాగపూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జీడీపీ కూడా పడిపోతుందని చెప్పారు.
పెద్దనోట్ల రద్దు విషయం కొందరికి ముందే తెలిసిందని, పెద్దమొత్తంలో రూ.2000 కొత్త నోట్లు పట్టుబడడంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దుతో గ్రామీణ ప్రాంత ప్రజల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉందని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎదుర్కునే ఇబ్బందుల కంటే ఇప్పుడు ఎదుర్కుంటున్న ఇబ్బందులే అధికంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఎన్డీఏ సర్కారు తీసుకున్న నిర్ణయంతో దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీర్ఘకాలంగా ప్రతికూల ప్రభావాలు ఎదుర్కుంటామని అన్నారు.