: జయలలితకు చెందిన హైదరాబాద్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.. హైకోర్టులో పిల్
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అనేక ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయి. హైదరాబాదులో సైతం కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులు ఆమెకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ లో కూడా ఆమె తన ఆస్తుల విలువను రూ. 113.73 కోట్లుగా ప్రకటించారు. ఇందులో హైదరాబాదులోని మేడ్చల్ లో 14 ఎకరాల ఫాంహౌస్, శ్రీనగర్ కాలనీలో కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని జయ ఆస్తులకు సంబంధించి ఉమ్మడి హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. గరీబ్ గైడ్ అనే ఓ స్వంచ్ఛంద సంస్థ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.
జయలలిత తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని... ఆమె సోదరుడు జయకుమార్ కూడా 1995లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని... దీంతో, ఆమె ఆస్తులను పొందే వ్యక్తులు ఎవరూ లేరని గరీబ్ గైడ్ తన పిల్ లో పేర్కొంది. శశికళకు జయలలిత ఆస్తులు పొందే హక్కు ఏమాత్రం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో, నగరంలోని జయ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పిటిషన్ లో కోరింది. ఈ ఆస్తులను పబ్లిక్ ప్రాపర్టీగా ప్రకటించాలని హైకోర్టుకు విన్నవించింది.