: తెలంగాణలో వర్షాలు పడే సూచనలు ... పడిపోనున్న ఉష్ణోగ్రతలు
వార్దా తుపాను ప్రభావం తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రపై మాత్రమే కాకుండా తెలంగాణపై కూడా పడింది. తుపాను ప్రభావం వల్ల ఈరోజు, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని... పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, మెదక్ లలో 13 డిగ్రీలు, హన్మకొండ, ఖమ్మంలలో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, హైదరాబాద్ లో మాత్రం ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా 18 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, 31 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.