: దివ్యశక్తులు ఉన్నాయంటూ మేకపిల్లకు భారీగా పూజలు
మేకపిల్లకు దివ్యశక్తులు ఉన్నాయంటూ స్థానికులంతా దానికి పూజలు చేస్తున్నారు. ఈ సన్నివేశం మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఖర్గోన్ జిల్లాలోని బిరోతి గ్రామంలో రెండు నెలల వయసున్న మేక పిల్ల ఉంది. ఇది నెల వయసు ఉన్నప్పటి నుంచే పాలు ఇవ్వడం ప్రారంభించింది. తన తల్లి వద్ద పాలు తాగడంతో పాటు... అది కూడా పాలు ఇస్తోంది. దీంతో, ఆ మేకపిల్లకు దివ్యశక్తులు ఉన్నాయని... అందుకే ఇది ఇలా చేస్తోందని భావించిన స్థానికులు, దానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. మరోవైపు, దీని గురించి పశువైద్య నిపుణులు మాట్లాడుతూ, లక్షల్లో ఒకదానికి మాత్రమే ఇలా జరుగుతుందని చెప్పారు. హార్మోన్ల ప్రభావం వల్లే చాలా అరుదుగా ఇలా జరుగుతుందని తెలిపారు. ఏదేమైనప్పటికీ, తన మేకపిల్ల ఇంత ఫేమస్ కావడంతో దాని యజమాని సఖీ బాయ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.