: వార్దా ప్రభావం: చెన్నయ్ లో పెనుగాలుల బీభత్సం.. వాహన, విమాన రాకపోకల బంద్
చెన్నయ్ తీరాన్ని తాకిన వార్దా అతితీవ్ర తుపాను ప్రభావంతో చెన్నయ్ నగరం వణికిపోతోంది. చెన్నయ్‌లోని 30 పునరావాస కేంద్రాలకు అధికారులు ప్రజలను తరలించారు. బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండడంతో ఇప్పటికే వందలాది చెట్లు, స్తంభాలు నేలకొరిగాయి. సాయంత్రం వరకు ఎవరూ బయటకు రాకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తోంది. చెన్నయ్ విమానాశ్రయ రన్‌వే తాత్కాలికంగా మూసేశారు. చెన్నయ్‌కు వచ్చే విమానాలను హైదరాబాద్, బెంగళూరుకు మళ్లించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాలకు తరలించడానికి ఆహార పొట్లాలను ఎన్డీఆర్ఎఫ్ బృందం సిద్ధంగా ఉంచుకుంది. ఇప్పటివరకు 7,357 మంది తుపాను ప్రభావిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇదిలా వుండగా, చెన్నయ్‌లోని ఓ రహదారిలో ఓ కారుపై భారీ వృక్షం పడింది. అయితే, కారులోని ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. చెన్నయ్‌లో సముద్రం కొన్ని అడుగులు ముందుకు వచ్చింది. మరో గంటలో గాలులు మరింత పెరిగే అవకాశం ఉంది. వందలాదిగా రహదారులపై కూలుతున్న చెట్లతో వాహనరాకపోకలు పూర్తిగా స్తంభించాయి.