: ‘చూస్తూ ఊరుకోం జాగ్రత్త’.. డొనాల్డ్ ట్రంప్‌కు చైనా ఘాటు హెచ్చ‌రిక


అమెరికా అధ్య‌క్ష పీఠంపై త్వ‌ర‌లో కూర్చోనున్న డొనాల్డ్ ట్రంప్‌ను చైనా ఘాటుగా హెచ్చ‌రించింది. ట్రంప్ తాజాగా చైనాని ఉద్దేశించి మాట్లాడుతూ 'వన్ చైనా' పాలసీ పేరుతో తైవాన్ పట్ల చైనా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని, ఇతర దేశాలకు ఏమాత్రం సాయపడని చైనాతో త‌మ దేశం కలిసి పనిచేయాల్సిన అవసరం ఏముందని  ప్రశ్నించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ చైనా  ప్రభుత్వ రంగ పత్రిక గ్లోబల్ టైమ్స్ లో డొనాల్డ్ ట్రంప్ను గ‌ట్టిగా హెచ్చరించింది.  స‌ద‌రు పాలసీ విష‌యంలో త‌మ‌తో సంప్రదింపులు జరగకుండా, పక్కకు నెట్టేస్తే తాము చూస్తూ ఊరుకోబోమ‌ని అందులో పేర్కొంది. త‌మ దేశం అమెరికా శత్రువులతో కలిసి పనిచేసి డొనాల్డ్‌ ట్రంప్‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తామ‌ని తెలిపింది.

దౌత్య సంబంధాల గురించి ట్రంప్ చేసే వ్యాఖ్య‌లు చిన్న‌పిల్లాడి మాటల్లా ఉన్నాయని, ట్రంప్ అమాయకంగా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని చైనీస్ పత్రిక పేర్కొంది.  చైనా తైవాన్‌ను త‌మ భూభాగంగా భావించే విష‌యం తెలిసిందే. తైవాన్‌ స్వాతంత్ర్యానికి అమెరికా బహిరంగంగా మద్దతిచ్చినా, తైవాన్‌కు ఆయుధాలు అందించినా తాము చూస్తూ ఊరుకోబోమ‌ని ప‌త్రిక‌లో పేర్కొంది. కొన్ని రోజుల ముందు  తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్తో డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడిన‌ప్పుడు కూడా చైనా ఇదే విధంగా ఘాటుగా స్పందించిన విష‌యం తెలిసిందే. ఈసారి మ‌రోసారి గట్టిగా హెచ్చ‌రించ‌డం అల‌జ‌డి రేపే విధంగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ లాంటి ఓ వ్యాపారవేత్త త‌న‌ వ్యాపారాల కోసం ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం సాధార‌ణ‌మే అయినా, చైనాతో బిజినెస్ చేయడాన్ని తైవానే ఎప్పుడూ ప్రశ్నించలేదని చైనా వ్యాఖ్య‌లు చేసింది. డొనాల్డ్ ట్రంప్  తాను చేసే వ్యాఖ్యలతో త్వ‌ర‌లో ఆపదలో ప‌డ‌తార‌ని కూడా పేర్కొంది.

  • Loading...

More Telugu News