: మహాత్మాగాంధీ మంచి తండ్రి కాలేకపోయారు: ప్రముఖ రచయిత్రి నీలిమా దాల్మియా ఆధార్
మహాత్మాగాంధీ మంచి తండ్రి కాలేకపోయారని కస్తూర్బా గాంధీ డైరీ ఆధారంగా ఒక పుస్తకం రాసిన ప్రముఖ రచయిత్రి నీలిమా దాల్మియా ఆధార్ అన్నారు. మహాత్ముడి భార్య అయిన కస్తూర్బా రాసిన డైరీ ఆధారంగా ‘ది సీక్రెట్ డైరీ ఆఫ్ కస్తూర్బా’ అనే పుస్తకాన్ని నీలిమ వెలువరించారు. ఈ సందర్భంగా ఆ పుస్తకంలో మహాత్ముడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను పేర్కొన్నారు. గాంధీ మహాత్ముడి చరిత్రను కించపరచడం తన ఉద్దేశం కాదని ఆమె చెప్పారు. భార్యతో వ్యక్తిగత జీవితం నుంచి కూడా ఆయన దూరంగా ఉన్నారని, తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారని, తన పిల్లలకు మంచి తండ్రి కాలేకపోయారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. చరిత్రలో కస్తూర్బా గురించి ఒక్క పదం కూడా పొందుపరచలేదని, ఇదంతా ఒక అసాధారణ మహిళను నిర్లక్ష్యం చేసి మర్చిపోవడమే అవుతుందని, ఆమె ఎదుర్కొన్న సవాళ్లను చరిత్ర గుర్తించలేదని ఆ పుస్తకంలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.