: లోక్‌సభలో పెద్దనోట్ల రద్దుపై మాట్లాడనివ్వలేదు.. జన్‌సభలో మాట్లాడుతున్నా..మోదీ ఉద్వేగపూరిత ప్రసంగం
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. అక్కడి దీసాలో పాల ఉత్పత్తి సహకార కేంద్రంతో పాటు పాల సహకార కేంద్రాలను ప్రారంభించారు. వాటితోపాటు పలు ప్రాజెక్టులకు కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పెద్దనోట్ల రద్దు అంశంపై ప్రధానంగా ప్రస్తావించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. పార్లమెంటులో చర్చ జరగకుండా విపక్ష సభ్యులు అడ్డుతగులుతున్నారని చెప్పారు. పార్లమెంటులో జరుగుతున్న గందరగోళంపై ఎంతో రాజకీయ అనుభవం ఉన్న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా అసహనం వ్యక్తం చేశారని ఆయన అన్నారు. పెద్దనోట్ల రద్దుపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నప్పటికీ ప్రతిపక్ష నేతలు తీవ్ర గందరగోళం సృష్టిస్తూ అందరికీ అసహనం కలిగిస్తున్నాయని మోదీ అన్నారు. తమ ప్రభుత్వం పెద్దనోట్లపై చర్చకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని ఆయన అన్నారు. లోక్‌సభలో తనకు ఈ అంశంపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, కానీ తాను జన్‌సభలో ఈ రోజు మాట్లాడుతున్నానని చెప్పారు. అక్రమమార్గాల్లో డబ్బు మార్చుకుంటున్న వారిని తాము వదిలిపెట్టబోమని వారినందరినీ పట్టుకొని తీరుతామని ఉద్ఘాటించారు. పెద్దనోట్ల రద్దు దేశంలోని పేదలకు ఎంతో లాభం చేకూర్చుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామాన్యుడిని విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని, నిజానిజాలను చెప్పేందుకే జనం ముందుకు వచ్చానని అన్నారు. నల్లధనాన్ని నిర్మూలించడం కోసమే పెద్దనోట్లను రద్దు చేశామని అన్నారు.