: 'డిజిశాల' టీవీ ఛానెల్ వచ్చేసింది... నగదు రహిత చెల్లింపులపై పాఠాల బోధన!
దేశంలో నగదు రహిత లావాదేవీలను పెంచి పోషించేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఓ సరికొత్త టీవీ చానల్ ను ప్రారంభించింది. విద్యార్థులకు పాఠాలు చెప్పే కళాశాల, పాఠశాల ప్రేరణతో ఈ చానల్ కు 'డిజిశాల' అని పేరు పెట్టగా, 24 గంటల పాటూ ఇందులో 'నగదు రహిత' పాఠాల బోధన ఉంటుంది. ఏఏ బిల్లు చెల్లింపులకు కార్డులు వాడితే, ఎలాంటి ప్రయోజనాలు, ఎక్కడ ఏం కొనుగోలు చేసి ఏ కార్డును వాడితే ఎంత క్యాష్ బ్యాక్ లభిస్తుంది.. ఇత్యాది విషయాలను ఈ చానల్ ప్రసారం చేస్తుంటుంది. కాగా, ప్రస్తుతం రోజుకు మూడు నుంచి నాలుగు గంటల ఒరిజినల్ కంటెంట్ తో వస్తున్న ఈ శాటిలైట్ చానల్ ను తప్పనిసరిగా ప్రసారం చేయాలన్న నిబంధనేదీ విధించలేదని, డైరెక్ట్ టు హోం కస్టమర్లు సైతం కావాలని భావిస్తేనే ఈ చానల్ ను తీసుకోవచ్చని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఈ చానల్ ను దూరదర్శన్ నిర్వహిస్తుందని సమాచార, ప్రసారాల శాఖ వెల్లడించింది. వివిధ ప్రభుత్వ విభాగాలు, నీతి ఆయోగ్, గ్రామీణాభివృద్ధి శాఖ తదితరాలు తయారు చేసిన కార్యక్రమాలు ప్రసారమవుతాయి. పాయింట్ ఆఫ్ సేల్స్ ప్రయోజనాలు, ఆధార్ ఆధారిత చెల్లింపుల్లో రాయితీల గురించిన వివరాలుంటాయి. ప్రజల్లో నగతు రహిత ప్రపంచంపై వినోదాత్మక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడం చానల్ ఉద్దేశమని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ చానల్ ఉచితమని, ప్రతి పౌరుడికి ముఖ్యంగా రైతుకు, విద్యార్థికి, దళితులకు, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తుందని సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. చానల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నిజాయతీగా పన్ను చెల్లింపులు జరిపితే, జీడీపీ పెరిగి దేశం అభివృద్ధిలో ముందడుగు వేస్తుందని అన్నారు.