: కేంద్రంతో మమత ఢీ.. మరోసారి నిప్పులు.. పారికర్ లేఖపై గరంగరం
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోమారు కేంద్ర ప్రభుత్వంపై ఫైరయ్యారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం సైన్యాన్ని వాడుకుంటోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. సైన్యాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా రాజకీయ కక్షలు తీర్చుకోవడం తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ చూడలేదన్నారు. అలాగే రక్షణమంత్రి మనోహర్ పారికర్‌పైనా మమత నిప్పులు చెరిగారు. సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగడంపై తాను ఎంతో బాధపడ్డానన్న పారికర్ లేఖపై సీఎం ఘాటుగా స్పందించారు. ఒక ముఖ్యమంత్రికి లేఖ ఎలా రాయాలో తెలియదా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ఒకరు ముఖ్యమంత్రికి పరువునష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాతి నుంచి కేంద్రంపై నిప్పులు చెరుగుతున్న మమత కోల్‌కతాలో ఆర్మీ తనిఖీలు నిర్వహించడంతో తన దాడిని మరింత ఉద్ధృతం చేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు మమత ప్రతిరోజూ కేంద్రంపై విరుచుకుపడుతూనే ఉన్నారు.