: అఫ్రిది కెరీర్ ముగిసినట్టే..నా!?
'బూమ్ బూమ్.. బూమ్ బూమ్..'! పాకిస్తాన్ డాషింగ్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది బ్యాటింగ్ కు దిగే సమయంలో అభిమానుల నోట వినిపించే అరుపులివి. ఇక ఆ అరుపులు మనం వినలేమేమో. ఎందుకంటే, ఇటీవల కాలంలో ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతోన్న అఫ్రిదిపై సెలెక్టర్లు విశ్వాసం కోల్పోయినట్టే కనిపిస్తోంది. తాజాగా, చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన పాక్ జట్టులో ఈ ఆల్ రౌండర్ కు చోటు నిరాకరించింది పాక్ సెలెక్షన్ కమిటీ.
గత 12 వన్డేల్లో కేవలం 161 పరుగులు చేసిన అఫ్రిది బౌలింగ్ లో 4 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. పైగా, బౌలర్ గానే ఇటీవల కాలంలో జట్టుకు ఎంపికవుతున్న అఫ్రిది బంతితోనూ పేలవ ప్రదర్శనే చేస్తున్నాడు. కాగా, అఫ్రిదిపై వేటుతో అతని కెరీర్ ముగిసినట్టు కాదని పాక్ క్రికెట్ ఛీఫ్ సెలక్టర్ ఇక్బాల్ ఖాసిమ్ అభిప్రాయపడ్డారు. మెరుగైన ప్రదర్శన కనబరిచి జట్టులోకి వచ్చేందుకు ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు.