: జయలలిత మృతిపై నటి గౌతమి వ్యక్తం చేసిన అనుమానాలపై స్పందించిన అన్నాడీఎంకే
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై నటి గౌతమి పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. జయలలితకు సంబంధించిన ప్రతి విషయాన్నీ రహస్యంగా ఉంచారని, వాటికి జవాబు చెప్పాలని ఆమె అందులో పేర్కొన్నారు. గౌతమి చేస్తోన్న ఆరోపణలపై అన్నాడీఎంకే పార్టీ స్పందించింది. గౌతమి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి తెలిపారు. అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స తీసుకుంటుండగా ఆసుపత్రి పలుసార్లు ప్రత్యేక బులిటెన్‌లను విడుదల చేసిందని చెప్పారు. జయలలితకు విదేశీవైద్య నిపుణులతో పాటు ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చిన వైద్యుల బృందం కూడా చికిత్స అందించిందని సరస్వతి తెలిపారు. వారిలో తమ పార్టీకి చెందినవారు ఎవరూ లేరన్న విషయాన్ని గౌతమి తెలుసుకోవాలని సరస్వతి సూచించారు. అంతేగాక, జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ప్రధానిమోదీతో పాటు కేంద్రమంత్రులు ఎప్పటికప్పుడు ఆరా తీశారని చెప్పారు. ప్రత్యేకంగా చెన్నయ్‌కి ఎయిమ్స్ వైద్యులను కూడా పంపించారని అన్నారు. జయలలిత ఆరోగ్యంపై ఏ రోజూ మాట్లాడని గౌతమి ఇప్పుడు ఇటువంటి తీరును కనబర్చడం బాధాకరమని సరస్వతి పేర్కొన్నారు.