: ఆమెను వీడని కష్టాలు.. ఈజిప్టు నుంచి ఆమెను తీసుకురావడానికి రూ.20 లక్షలు అవసరం!


అధిక బరువుతో బాధపడుతున్న ఈజిప్టు దేశీయురాలు ఇమాన్‌ అహ్మద్‌ అబ్దులతికి తాను ఉచితంగా ఆపరేషన్ చేస్తానని ముంబయి వైద్యుడు ముఫజల్‌ లక్డావాలా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆమెను కష్టాలు మాత్రం వీడడం లేదు. ఆమెను ఈజిప్టునుంచి ముంబ‌యికి తీసుకురావాలంటే దాదాపు రూ.20 లక్షలు ఖర్చవుతుంది. త‌మ వ‌ద్ద అంత డబ్బు లేద‌ని ఇమాన్‌ తల్లిదండ్రులు ఆవేద‌న చెందుతున్నారు. వైద్యుడు ముఫజల్‌ లక్డావాలా ఇమాన్‌ పేరుతో ఇప్ప‌టికే ఒక అకౌంట్‌ను ఏర్పాటు చేసి, దాత‌లు ఎవ‌ర‌యినా ఆమెను ఆదుకోవ‌డానికి విరాళాలు ఇవ్వాల‌ని కోరుతున్నాడు. ఆమె ముంబ‌యిలో శ‌స్త్ర‌చికిత్స చేయించుకునేందుకు మొద‌ట‌ వీసా సమస్య ఎదురైంది. విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ విష‌యంలో శ్ర‌ద్ధ తీసుకోవ‌డంతో ఆమెకు వీసా వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ ఆమెకు ఇబ్బందులు త‌ప్ప‌డంలేదు. ఆమెను ఈజిప్టు నుంచి ముంబయికి తీసుకురావడానికి విమాన సంస్థలు ఒప్పుకోవ‌డం లేదు. ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారం ఆమెను ఎక్కించడానికి సరిపోయేంత ఉండ‌కపోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అయితే ఆమెను ఈజిప్టు నుంచి తీసుకురావ‌డానికి కమర్షియల్‌ ఫ్లైట్ ను ఉప‌యోగిస్తే బాగుంటుంద‌ని భావిస్తున్నారు. అందుకోసం విమానంలో తొమ్మిది సీట్లను తొలగించి ఆమె కోసం ప‌లు మార్పులు చేయాల్సి వస్తుంది. ఇందుకోసం జెట్‌ ఎయిర్‌వేస్‌, ఎయిర్‌ఇండియా, ఈజిప్టు ఎయిర్‌వేస్ సాయాన్ని కోరుతూ ముంబ‌యి వైద్యుడి టీమ్ ఓ లేఖను రాసింది. ఆమెను ముంబ‌యికి త‌ర‌లించేలా ప్ర‌భుత్వ‌ సాయం కూడా కోరతామని పేర్కొంది. అయితే, ఈజిప్టు నుంచి ముంబయికి నేరుగా ఎటువంటి విమాన సర్వీసులను లేవ‌ని ఎయిర్ ఇండియా తెలిపింది.

  • Loading...

More Telugu News