: సెంచరీతో రాణించిన జెన్నింగ్స్...వరుసగా రెండు వికెట్లు తీసిన అశ్విన్
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు ఆకట్టుకుంది. ఓపెనర్లు కెప్టెన్ కుక్ (46), జెన్నింగ్స్ (112) అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. దీంతో సిరీస్ లో తొలిసారి ఇంగ్లండ్ జట్టు కుదురుకున్నట్టు కనిపించింది. అయితే జడేజా సంధించిన అద్భుతమైన బంతికి కుక్ పెవిలియన్ చేరాడు. అనంతరం రూట్ (21) కుదురుకున్నట్టే కనిపించినా అశ్విన్ మాయాజాలానికి బోల్తా కొట్టాడు. తరువాత వచ్చిన మొయిన్ అలీ (50) జెన్నింగ్స్ తో కలిసి కుదురుకున్నాడు. అర్ధసెంచరీ సాధించి ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించేందుకు బాటలు వేశాడు. తరువాత స్వీప్ షాట్ కు యత్నించి కరుణ్ నాయర్ చేతికి చిక్కాడు. అనంతరం సెంచరీ సాధించిన జెన్నింగ్స్ కు గుడ్ లెంగ్త్ బంతిని సంధించిన అశ్విన్ ఫలితం రాబట్టాడు. పుజారా చక్కని క్యాచ్ అందుకోవడంతో ఇంగ్లండ్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. దీంతో బెయిర్ స్టో (2), బెన్ స్టోక్స్ (1) క్రీజులో ఉన్నారు. 74 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు 233 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లతో రాణించగా, అతనికి ఒక వికెట్ తో జడేజా చక్కని సహకారమందిస్తున్నాడు.