: క్రికెట్లోనూ ‘రెడ్‌కార్డు’.. కీలక సిఫార్సులు చేసిన ఎంసీసీ
క్రికెట్లో విప్లవాత్మక మార్పులకు మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సమాయత్తమవుతోంది. ప్రస్తుతం ఫుట్‌బాల్, హాకీ తదితర క్రీడల్లో అమల్లో ఉన్న రెడ్‌కార్డు విధానాన్ని త్వరలో క్రికెట్లో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. బ్యాట్ సైజు తగ్గించడంతోపాటు రెడ్‌కార్డ్ సస్పెన్షన్‌ను అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రపంచ క్రికెట్ కమిటీకి ఎంసీసీ సూచించింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ బ్రియర్లీ అధ్యక్షతన రెండు రోజులపాటు ముంబైలో సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజ్రాజా, ఎంసీసీ చీఫ్ జాన్ స్టీఫెన్సన్ పాల్గొన్నారు. ఈ సిఫార్సులను ఎంసీసీ ప్రధాన కమిటీకి అందజేస్తారు. అక్కడ కనుక ఆమోదం పొందితే ‘లా ఆఫ్ క్రికెట్’లో భాగంగా కొత్త కోడ్ వచ్చే ఏడాది అక్టోబరులో మొదలవుతుంది. మైదానంలో దురుసుగా ప్రవర్తించే ఆటగాళ్లపై ‘రెడ్‌కార్డు’ నోటీసుతో సస్పెన్షన్ వేటు వేయాలని కమిటీ సూచించింది. అలాగే బ్యాట్స్‌మన్ కొట్టే బంతి ఫీల్డర్ హెల్మెట్‌కు తాకితే దానిని పట్టినా నాటౌట్‌గా ప్రకటిస్తున్నారు. ఇక నుంచి మాత్రం దానిని అవుట్‌గా పరిగణించాలని కమిటీ సూచించింది. ప్రస్తుతం ఉన్న బ్యాట్ సైజును కుదించేందుకు 60 శాతం మంది మద్దతు ఇస్తున్నట్టు రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టే విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.