: జయ మరణం తరువాతి గంటలు... చీకటి రాజకీయం!
తమిళ ప్రజల ప్రియతమ నేత జయలలిత మరణించిన తరువాత, ఆ వార్త బయటకు వచ్చే ముందు చీకటి రాజకీయాలు జరిగాయా? జరిగిన పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అమ్మ మరణ వార్త ముందుగా తెలుసుకున్న శశికళ, తన పట్టు నిలుపుకోవడం కోసం మృతదేహం పక్కనుండగానే రాజకీయాలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అమ్మ మరణం తరువాత, మంత్రులు, ఎమ్మెల్యేలను అపోలోకు పిలిపించిన శశికళ, పన్నీర్ సెల్వం లేకుండానే వారితో తెల్లకాగితాల మీద సంతకాలు చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఆపై అర్ధరాత్రి 12 గంటలకు అన్నా డీఎంకే శాసనసభాపక్ష భేటీ, నేతగా పన్నీర్ ఎన్నిక, ఆగమేఘాల మీద 1.25 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం ఇత్యాది ఘటనలు అందరికీ తెలిసినవే. ఇక జయ మృతదేహం అపోలో ఆసుపత్రిలో ఉండగానే చుట్టూ, శశికళ బంధువులు చేరిపోయారు. జయ రక్తసంబంధీకులెవరూ కనీసం అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేదు. వారు పాల్గొనలేదనడంకన్నా, ఆ అవకాశం వారికి శశికళ దక్కనీయలేదనని భావించవచ్చు. అంతకుముందు జయలలిత మృతి చెందినట్లు అధికారిక ప్రకటన వెలువడటానికి ముందే, పార్టీని సొంతం చేసుకోవడానికి శశికళ పావులు కదిపారు. జయలలిత దూరంగా పెట్టిన శశికళ భర్త నటరాజన్, ఇతర బంధువర్గం అంతా ఒక్కసారిగా అపోలో ఆసుపత్రికి వచ్చి వాలింది. పన్నీర్ సెల్వంకు బదులు తనకు బాగా నమ్మకస్తుడైన మంత్రి పడపాటి పళని స్వామిని ముఖ్యమంత్రిని చేసేందుకు శశికళ పావులు కదిపినట్టు తెలుస్తోంది. వాస్తవానికి జయలలిత 5వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకే చనిపోయినట్టు ఆసుపత్రి వర్గాలు శశికళకు, పన్నీర్ సెల్వానికి స్పష్టం చేయగా, అప్పటి నుంచి రాజకీయం నడిచింది. జయలలిత మృతదేహం పోయెస్ గార్డెన్ కు చేరుకునే సరికే శశికళ, ఆమె భర్త నటరాజన్, బంధువులు ఇళవరసి, సుధాకర్, రావణన్, దివాకరన్ తదితరులు పార్థివదేహం చుట్టూ చేరిపోయారు. అక్కడి నుంచి రాజాజీ హాల్ కు, మెరీనా బీచ్ లో అంతిమ సంస్కారాలు ముగిసే వరకూ మరెవ్వరినీ ఆ స్థానాల్లోకి రానీయలేదు. జయలలిత కుటుంబ సభ్యులను కూడా దగ్గరికి రానివ్వని శశికళ వ్యవహార శైలిని ఇప్పుడు పలువురు విమర్శిస్తున్నారు.