: నోట్ల రద్దుకు నేటితో నెల.. తీరని ఇక్కట్లు.. పెరుగుతున్న క్యూలు


అప్పుడే నెల రోజులు గడిచిపోయాయి. కష్టాలు మాత్రం వదలడం లేదు. క్యూలు కరగడం లేదు. ఏటీఎంల కోసం తిరిగి కాళ్లు నొప్పులు పుడుతుంటే.. డబ్బుల కోసం ఎదురుచూసీచూసీ కళ్లు కాయలు కాస్తున్నాయి. బ్యాంకులో డబ్బులున్నా జేబులు ఖాళీ. దేశం కోసం పెద్ద నోట్ల రద్దు కష్టాలను భరిస్తామని మొదట చెప్పుకొచ్చిన ప్రజలు నెల రోజులు గడుస్తున్నా కష్టాలు కడతేరకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం డిసెంబరు 6 వ తేదీ నాటికి బ్యాంకులకు తిరిగి వచ్చిన సొమ్ము రూ.11..85 లక్షలు. ప్రజల వద్ద చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్ల విలువ రూ.14.13 లక్షల కోట్లు. అంటే దాదాపు 80శాతం సొమ్ము బ్యాంకులకు తిరిగి వచ్చినట్టే. అంటే మిగిలింది మాత్రం కాస్త అటూ ఇటుగా 2.3 లక్షల కోట్లు. కాగా మొత్తంగా రూ.లక్ష కోట్ల నల్లధనం మాత్రమే కాలగర్భంలో కలిసిపోతుందని అంచనా. కాగా నల్లధనం నియంత్రణలో కీలకపాత్ర పోషించాల్సిన బ్యాంకులు, పోస్టాఫీసులే పలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తుండడంతో ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్, సీబీఐ రంగంలోకి దిగి తనిఖీలు ప్రారంభించాయి. అనుమానితులను అరెస్టులు కూడా చేస్తున్నాయి. మరోవైపు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం హడావిడిగా తీసుకున్న నిర్ణయం కాదని బుధవారం ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్పష్టం చేశారు. నోట్ల రద్దు ఇబ్బందులు తాత్కాలికమేనని, మున్ముందు మంచి ఫలితాలు వస్తాయని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News