: సూపర్ స్టార్ కృష్ణ పెద్దకూతురి పెళ్లికి జయలలితను మొదట ఆహ్వానించినా.. ఆ తర్వాత రావద్దన్నారట!
సూపర్ స్టార్ కృష్ణ తన పెద్దకూతురి పెళ్లికి నాడు సీఎంగా ఉన్న జయలలితను మొదట ఆహ్వానించినా, ఆ తర్వాత రావొద్దని చాలా సున్నితంగా ఆమెకు చెప్పారట. ఆమెను ఎందుకు రావద్దన్నారనే దానికి కృష్ణ ఇచ్చిన వివరణ విని జయలలిత నవ్వుకున్నారట. ఈ విషయాన్ని డేరింగ్, డాషింగ్ హీరో కృష్ణ స్వయంగా చెప్పారు. తన కూతురు పద్మావతి పెళ్లి చెన్నైలో చేశామని, ఈ పెళ్లికి నాడు సీఎంగా ఉన్న జయలలితను ఆహ్వానించగా, తప్పకుండా వస్తానని ఆమె చెప్పిందని కృష్ణ అన్నారు. అయితే, మూడు రోజుల తర్వాత జయలలిత భద్రతా అధికారి ఒకరు కృష్ణ వద్దకు వచ్చి ఒక విషయం చెప్పారట. భద్రతా కారణాల రీత్యా కల్యాణ మండపంలోని మొదటి మూడు వరుసలను సీఎంకి, ఆమె భద్రతా సిబ్బందికి కేటాయించమని చెప్పడంతో కృష్ణ ఆశ్చర్యపోయారట. ఈ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు పలువురు హాజరవుతారు కనుక ఆ విధంగా చేయడం సాధ్యం కాదని భావించిన ఆయన ఒక నిర్ణయానికి వచ్చారట. ఈ ఇబ్బందుల గురించి స్వయంగా జయలలితకు తెలియజేసి.. పెళ్లికి రావొద్దని సున్నితంగా తెలియజేశానని.. తాను చెప్పిన వివరణ విని నవ్వుకున్న ఆమె, అందుకు సరేనని చెప్పిందని, పెళ్లి రోజున తన కూతురిని ఆశీర్వదిస్తూ ఒక ఫ్లవర్ బొకేను జయలలిత పంపారని కృష్ణ గుర్తు చేసుకున్నారు. అన్నట్టు ‘గూఢచారి 116’, ‘నిలువు దోపిడీ’ వంటి సినిమాల్లో కృష్ణ సరసన జయలలిత కథానాయికగా నటించింది.