: ఆశా బోంస్లేకు 'కరెంట్' షాక్.. ఖాళీగా ఉన్న బంగ్లాకు భారీ మొత్తంలో ఎలక్ట్రిసిటీ బిల్లు!
ప్రముఖ సినీ గాయని ఆశా బోంస్లే తనకు వచ్చిన విద్యుత్ బిల్లు చూసి షాక్‌కు గురయ్యారు. అయితే, ఆ బిల్లు ఆమె ప్రస్తుతం ఉంటున్న ఇంటికి కాదు, ఆమెకు చెందిన ఖాళీగా ఉన్న ఓ బంగ్లాకు వచ్చింది. కరెంటే ఉపయోగించని ఆ బంగ్లాకు ఏకంగా రూ.53,759 కరెంటు బిల్లును మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ అధికారులు పంపారు. ఈ విషయం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముంబయి నగరానికి 100 కి.మీ.దూరంలో లోనావాల స్టేషన్ సమీపంలోని లేక్ రోడ్డుపై ఆమెకు ఓ విలాసవంతమైన బంగ్లా ఉంది. ఎప్పుడయినా ఆ బంగ్లాకు వెళ్లినా ఆమె ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువగా అందులో ఉండరు. అలాంటిది ఇంత మొత్తంలో ఆ ఇంటికి కరెంట్ బిల్లు రావడంతో కంగారుపడిన ఆశా, ఈ విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి చంద్రశేఖర్ బావన్‌కులే దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ఆయన దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. పొరపాటునే ఈ బిల్లు వచ్చి ఉండవచ్చని అధికారులు అంటున్నారు.