: తాకనున్న సెగ... లీటరు పెట్రోలు రూ. 80 అవడం ఖాయమట!


అతి త్వరలో పెట్రోలు, డీజెల్ ధరలు ఆకాశాన్ని తాకేలా పరుగులు పెట్టనున్నాయని చమురు రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో మూడు నాలుగు నెలల్లో పెట్రోల్‌ ధర లీటరుకు రూ. 80కి, డీజిల్‌ ధర రూ. 68కి చేరుతుందని భావిస్తున్నారు. ఒపెక్ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌) దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయింఃచిన నేపథ్యంలో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి బ్యారల్ 55 డాలర్లకు చేరాయి. బ్యారల్ క్రూడాయిల్ ధర 60 డాలర్లను చేరితే, ఇండియాలో పెట్రోలు ధర రూ. 80ని తాకడం గ్యారంటీ అని చెబుతున్నారు. కాగా, ఒపెక్ దేశాలు జనవరి 1 నుంచి రోజుకు 12 లక్షల బ్యారళ్ల మేరకు క్రూడాయిల్ ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి. 2008 ఆర్థికమాంద్యం తరువాత ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్ నిర్ణయించడం ఇదే తొలిసారి కాగా, నవంబర్ 28 నుంచి ఇప్పటివరకూ క్రూడాయిల్ ధర ఏకంగా 19 శాతం పెరిగింది. ఇదే సమయంలో నాన్ ఒపెక్ దేశాలు 60 లక్షల బ్యారళ్ల మేరకు ఉత్పత్తిని తగ్గించనున్నట్టు ప్రకటించడంతో కష్టాలు మరింతగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ట్రేడింగ్ జోరుగా సాగుతుండటంతో, భారత చమురు రంగంపైనా ఈ ప్రభావం పడింది. మరో వారంలో జరగనున్న చమురు కంపెనీల సమీక్షలో పెట్రోలు, డీజెల్ ధరలు భారీగా పెరగవచ్చని కూడా భావిస్తున్నారు. మార్చి 2017 నాటికి బ్రెంట్ క్రూడాయిల్ ధర 50 నుంచి 55 డాలర్ల వరకూ ఉంటుందని తొలుత అంచనాలు వేసిన నిపుణులు, ఇప్పుడది 60 డాలర్లను దాటుతుందని చెబుతున్నారు. ఇక చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్‌ దేశాలు తీసుకున్న నిర్ణయం మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ, ఒపెక్ సభ్యదేశాలు, దీన్ని ఎంత వరకు అమలు చేస్తాయన్న అనుమానాలు నెలకొన్నాయి. గతంలోనూ ఇలాంటి ఒప్పందాలను ఒపెక్ పాటించలేదు. ఈ దఫా కూడా అదే జరిగితే పెట్రోలు ధరలు పెరగే అవకాశం లేదు. అలా కాకుంటే మాత్రం పెట్రోలు చుక్కలు చూపుతుందనడంలో సందేహం లేదు.

  • Loading...

More Telugu News