: కోదండరాంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు: 'టీఆర్ఎస్'పై భట్టీవిక్రమార్క ఆగ్రహం
టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేత మల్లు భట్టీవిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న సమస్యలపై టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం ప్రశ్నలు వేస్తోంటే వాటికి ఏం సమాధానం చెప్పాలో టీఆర్ఎస్ నేతలకు తెలియడం లేదని, అందుకే 'కాంగ్రెస్ ఏజెంట్' అంటూ ఆయనపై పలు వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అంటే అధికార పార్టీకి భయం పట్టుకుందని, అందుకే తాము వేసే ప్రశ్నలకు ప్రభుత్వ నేతలు జవాబు చెప్పడం లేదని అన్నారు. సమస్యలపై ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ టీఆర్ఎస్ సర్కారు లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో భావ ప్రకటనా స్వేచ్ఛ లేకుండా పోతోందని భట్టీవిక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విమలక్కను పోలీసులతో అణచివేసే ప్రయత్నం చేస్తూ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని అన్నారు. కేసీఆర్ రాజ్యహింసకు పాల్పడుతున్నారని, దీనికి వ్యతిరేకంగా అందరూ కలిసిపోరాడాలని అన్నారు.