: జయలలిత.. ముగ్గురు తెలుగు గవర్నర్లు!
దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితంలో ముగ్గురు తెలుగు గవర్నర్ల పాత్ర ఎంతో ఉంది. 1990వ దశకంలో మర్రి చెన్నారెడ్డి నుంచి ఇటీవలి రోశయ్య, ఆపై విద్యాసాగర్ రావులు తమిళనాడుకు గవర్నర్ గా ఉన్న సమయంలోనే ఆమె జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు జరిగాయి. జయలలితను అదుపులో ఉంచాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ మర్రి చెన్నారెడ్డిని ఆమెపై ప్రయోగిస్తే, ఆయనను సమర్థవంతంగా అడ్డుకున్న చరిత్ర జయలలితది. చెన్నారెడ్డి ఉన్న సమయంలో వీరిద్దరి మధ్యా పాలనలో ఆధిపత్యం కోసం పెద్ద యుద్ధమే జరిగింది. జయలలితను అణగదొక్కాలని చెన్నారెడ్డి, ఆయన అధికారాన్ని పరిమితం చేయాలని జయలలిత ఎత్తుకు పైఎత్తులు వేసుకున్నారు. ఆపై జయలలితను మంచి చేసుకునేందుకు రోశయ్యను గవర్నర్ గా పంపింది కేంద్రం. ఏపీ సీఎంగా రాజీనామా చేసిన రోశయ్యను తమిళనాడు గవర్నర్ గా నాటి యూపీఏ ప్రభుత్వం ఎంపిక చేయగా, జయలలిత, రోశయ్యల నడుమ సత్సంబంధాలు నడిచాయి. చెన్నారెడ్డిలా ఉప్పు నీరులా కాకుండా, ఇరుగు పొరుగు స్నేహితుల్లా రోశయ్య మెలిగారు. రోశయ్య గవర్నర్ గా ఉన్న సమయంలోనే జయలలిత పాత రికార్డులు బద్దలు కొడుతూ, వరుసగా రెండుసార్లు అన్నా డీఎంకేను అధికారంలోకి తెచ్చిన గుర్తింపు సాధించారు. ఇక ఇప్పుడు ఆమె మరణం వేళ కూడా గవర్నర్ తెలుగు వ్యక్తే. సీహెచ్ విద్యాసాగర్ రావు ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి రాష్ట్రంలోని పరిస్థితులను సమీక్షిస్తూ, ఎప్పటికప్పుడు కేంద్రంతో చర్చిస్తూ, పాలన గాడితప్పకుండా చూశారు విద్యాసాగర్. ఇక తెలుగు సినీ ప్రముఖులతోనూ జయలలితకు సత్సంబంధాలే ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్, దివంగత ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ తదితర హీరోలతో ఎన్నో చిత్రాల్లో ఆమె నటించారు.